Tuesday, 9 August 2016

Independence Day Telugu Speech on 15 August for School childrens

Independence Day Telugu Speech on 15 August 


ఆగష్టు పదిహేను (August 15) భారత దేశపు స్వాతంత్ర్య దినోత్సవం గా జరుపుకోబడుతోంది. 1947 ఆగష్టు పదిహేనున భారత దేశం వందల ఏళ్ళ బానిసత్వాన్నుంచి విడుదలయింది. దానికి గుర్తుగా, స్వాతంత్ర్యానంతర ప్రభుత్వం ఆగష్టు పదిహేనుని భారత స్వాతంత్ర్య దినోత్సవంగా, జాతీయ శెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తోంది
భారతదేశాన్ని బ్రిటీష్ వారు క్రమక్రమంగా ఆక్రమించుకుంటూ 18 శతాబ్ది చివరకు దేశంలోని చాలా భాగాన్ని తమ పరిపాలన క్రిందకు, కొన్ని రాజ్యాలను తమ ప్రభావం క్రిందకు తీసుకువచ్చారు. 19 శతాబ్ది తొలినాటికి వారి ఆధిపత్యం పూర్తిగా స్థిరపడిపోయింది. 1858 వరకూ భారత దేశ సార్వభౌమునిగా మొఘల్ పరిపాలకులే ఉన్నా 19 శతాబ్ది తొలినాళ్ళ నుంచే ఆయన గౌరవాన్ని తగ్గిస్తూ వచ్చారు. చివరకు 1857లో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం జరిగి భారత సిపాయిలు, రాజులు అందులో ఓడిపోయాకా 1858లో బ్రిటీష్ రాణి భారత సామ్రాజ్యధినేత్రి అయ్యాకా దేశం బ్రిటీష్ పాలన కిందకి వచ్చింది. బ్రిటీష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేందుకు జరిగిన అనేకమైన పోరాటాల్లో ఎందరో దేశభక్తులు పాల్గొన్నారు. ప్రపంచ రాజకీయాల నేపథ్యంలోనూ, భారతీయ స్వాతంత్ర్య పోరాటాల ఫలంగానూ దేశానికి ఆగస్టు 14, 1947 అర్థరాత్రి సమయంలో స్వాతంత్ర్యం వచ్చింది.
చరిత్ర లోకి తొంగి చూస్తే భారత స్వాతంత్ర్య సంగ్రామం  1857 సంవత్సరం లోమీరట్ లో జరిగిన  సిపాయి తిరుగుబాటుతో మొదలయినట్టు కనిపిస్తుంది. అప్పటిదాకా తిరుగుబాటు ఎరుగని బానిసల్లా, తమ చైతన్యాన్ని , స్వేచ్చాప్రియత్వాన్ని మరచిపోయి బతికిన భారతీయుల్లో ఒక్కసారిగా మార్పు తెచ్చిన సంఘటన  సిపాయి తిరుగు బాటు .
భారత స్వతంత్ర పోరాటంలో మొట్టమొదటి ప్రజా ఉద్యమం 1905 లో ప్రజ్వరిల్లిన వందేమాతరం ఉద్యమం.
జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన.అమృత్‌సర్ పట్టణంలో జలియన్ వాలాబాగ్  తోట లో రౌలట్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సమావేశమైన నిరాయుధ స్త్రీ, పురుషులు , పిల్లలపైన, బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పది నిమిషాలపాటు కొనసాగిన ఈ కాల్పుల్లో అధికారిక ప్రకటన వేరుగా ఉన్నా వాస్తవానికి  వెయ్యిమందికి  పైగా మరణించారనీ ,  రెండువేల మందికి పైగా గాయపడ్డారనీ అంచనా.
ఈ సంఘటనకు నిరసనగా విశ్వకవి రవీంద్రనాథ ఠాకూర్, బ్రిటీష్ ప్రభుత్వం తనకిచ్చిన సర్ బిరుదును తిరిగి ఇచ్చివేశారు. ఈ సంఘటన 1920 లో గాంధీజీ ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా  సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించడానికి నాంది పలికింది. ఆ తర్వాత జరిగిన ఉప్పుసత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలు స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన చివరి ఘట్టాలు. ఉప్పుపై విధించిన పన్నును వ్యతిరేకిస్తూ 1930 మార్చి లో చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం , బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదలిపోవాలని డిమాండ్ చేస్తూ 1942 లో తలపెట్టిన "క్విట్ ఇండియా" ఉద్యమాలలో గాంధీజీ నిర్దేశించిన మార్గంలో  భారత జాతి అంతా నడిచింది. అప్పటివరకు స్వతంత్ర భారతదేశం కోసం  ప్రతిభా వంతమైన  ప్రణాళిక లేక అస్తవ్యస్తంగా నడిచిన భారతప్రజలని గాంధీజీ ఒక్క తాటిపై నడిపించారు. ప్రజాగ్రహం స్థానంలో సత్యాగ్రహంఆవేశం స్థానంలో అహింసను ఆయుధాలుగా గాంధీజీ మలచిన తీరు ప్రపంచదేశాలను విస్మయానికి గురి చేసింది.
లాలా లజపతి రాయ్ , సరోజినీ దేవి, సర్దార్ వల్లభభాయి పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ , బాబూ రాజేంద్రప్రసాద్, గోపాలకృష్ణ గోఖలే, టంగుటూరి ప్రకాశం పంతులు, సర్వేపల్లి రాధాకృష్ణన్,చక్రవర్తి రాజగోపాలాచారి  వంటి గాంధేయవాదులూ, రాజ్ గురు , సుఖ్ దేవ్, ఖుదీరామ్ బోస్, మదన్ లాల్ ధింగ్రా, చంద్రశేఖర ఆజాద్ , సుభాష్ చంద్ర బోస్  వంటి విప్లవ యోధులూ, అకుంఠిత దీక్షతో లక్ష్యసాధనే ధ్యేయంగా స్వాతంత్ర్యసంగ్రామంలో అనితర సాధ్యమైన పాత్రలను పోషించారు. లాఠీ దెబ్బలకూ , కఠినమైన జైలు జీవితానికీ  వెరవకుండా తమ ఆస్తిపాస్తులనూ, కుటుంబ జీవన సౌఖ్యాన్నీ త్యజించి, మాతృభూమి దాస్యవిమోచన కోసం  ఆత్మార్పణ  చేశారు.
  పలు మతాల భాషల పరిమళాల కదంబం ,
      పలు రీతుల సంగమం మా భారత కుటుంబం !
     సకళకళారామమిదే మా నివాసము ,
     అందరినీ ఆదరించు స్వర్గధామము
     ఇలాతలము పై వెలసిన స్నేహ దీపము , 
     సమత మమత రూపమే మా దేశము ! ”

 మన జాతీయపండుగలు మూడింటిలో స్వాతంత్ర్యదినోత్సవం ఒకటి  (మిగిలిన రెండూ రిపబ్లిక్ డే, మహాత్మా గాంథీ పుట్టిన రోజు) .భావి తరాల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకోసం తమ ప్రాణాలర్పించిన  త్యాగ ధనులకి మన మంతా నివాళులర్పించే రోజిది. ఈ సందర్బంగా  పాఠ శాలల్లోనూ, కళా శాలల్లోనూ ఆకాశవాణి, దూరదర్శన్ వంటి ప్రసార మాధ్యమాల్లోనూ అనేక రకాల పోటీలూ, ప్రత్యేక కార్యక్రమాలూ చోటుచేసుకుంటాయి . బహుమతి ప్రదానోత్సవాలు జరుగుతాయి. ప్రధాన మంత్రి, దేశ రాజధాని ఢిల్లీ లోని ఎర్రకోట పైన జాతీయ పతాకాన్ని ఎగరేసి, దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్ర రాజధానీ నగరాల్లో కూడా పతాకావిష్కరణ , సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. రంగు రంగుల దీప తోరణాలు కార్యాలయాల మీద , గృహ సముదాయాల మీదా తళుకులీనుతుంటే, కూడళ్ళ లోనూ, ఇంటి పైకప్పుల మీదా, ప్రభుత్వకార్యాలయాల మీదా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంటే, ప్రజలంతా దేశ స్వాతంత్ర్యం సిద్ధించిన రోజుని గొప్ప ఉత్సవంగా జరుపుకుంటారు . విదేశాల్లో కొన్ని ప్రాంతాలలో  ఆగస్టు పదిహేనవ తేదీని ఇండియా డే  గా వ్యవహరిస్తారు.

No comments:

Post a Comment